Wednesday, April 8, 2009

పెళ్ళెప్పుడు???

కొత్తగా ఉద్యోగం లో చేరాక మనకు తెలిసిన వాళ్ళెవరైన కనిపిస్తే.. "ఎలా ఉన్నావు? " అని అడిగినా అడగకపొయినా "పెళ్ళెప్పుడు? " అని మాత్రం తప్పకుండా అడుగుతారు.
సినిమాల్లో పెళ్ళి కాని అమ్మాయిల కష్టాలు చూపిస్తారు కానీ చదువు అవగొట్టి, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి కాని అబ్బాయిల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు.నా ఫ్రెండు ఒకడు "ఇంకో సంవత్సరం దాకా నాకు పెళ్ళి ఒద్దు మొర్రో " అని ఎంత గింజుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినలా..
తన మాటలు నచ్చక అందరూ రెండు రోజులు భోజనం మానేస్తారేమో అనుకున్నాడు. కానీ వీడికి తిండి పెట్టడం ఆపేసారు. దాంతో ఒప్పుకోక తప్పలేదు.ఇలాంటి పరిస్థితే దాదాపు అందరిదీ.పెళ్ళికి ఒప్పుకోగానే మన బాధ్యతంతా అయిపోదు. నిజానికి అప్పటి నుంచే అసలు టార్చర్ మొదలు.మొదట చెయ్యవలసింది..పెళ్ళిళ్ళ మార్కెట్లోకి వదలటానికి మంచి ఫొటోలు తీయించుకోవటం.
ఫొటోలు : ఏ ఫొటోలు పడితే అవి ఇవ్వకూడదంట..స్టూడియోలో నీలం గుడ్డ ముందు నుంచుని ఒకటి, కుర్చీలో కూర్చుని ఒకటి, ఫొటో మొత్తం మొహం మాత్రమే కనపడేలా ఒకటి తీయించుకోవాలి. "ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు " అన్నామంటే.. మనము ఇంటర్మీడియట్లో పరీక్ష హాల్ టికెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇస్తామని బెదిరిస్తారు.పెళ్ళి సంబంధాల కోసం ఫొటోలు తీయటానికి 'స్పెషలిస్ట్ 'లు ఉంటారు. వీళ్ళ దృష్టిలో అక్కడకు ఫొటో లు తీయించుకోవటానికి వచ్చిన వాళ్ళంతా శత్రు దేశ యుధ్ధ ఖైదీలు..స్టూడియో లోకి వెళ్ళగానే ఇంటరాగేషన్ టైము లో వేసినట్టు పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. "సరిగ్గా నుంచోండి సార్..కాస్త నవ్వండి..పై పళ్ళు నాలుగు, కింది పళ్ళు ఒకటిన్నర మాత్రమే కనపడాలి...ఎక్కువగా నవ్వకండి...ఆ చొక్కా గుండీ మీద ఇంకు మరకేంటి..తుడిచెయ్యండి "....ఇలా ఓ గంట సేపు రాగింగ్ చేసాక ఏవో ఫొటోలు తీసి పంపుతాడు. ఫొటోలు తీసినంత సేపూ మన మొహంలో ఏ పార్టూ సరిగ్గా లేదంటూ నిముషానికి ఒకసారి ఏడిపించి, అవమానించి..మన దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు గుంజేస్తాడు.

బయోడాటా: ఫొటోలు రెడీ అయ్యాక చెయ్యవలసిన పని బయోడాటా తయారు చెయ్యటం. మన గురించి, మన అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ బయోడాటా మాటి మాటికీ మారుస్తూ ఉంటే చాలా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.నా ఫ్రెండొకడు పేపర్ లో 'వధువు కావలెను ' అనే ప్రకటన లో మొదట "కట్నం లేకున్నా పరవాలేదు " అని ఇచ్చాడు. వాడికి తెలిసిన వాళ్ళెవరో "అలా ఇస్తే నీలో ఎదో లోపముందనుకుంటారు " అన్నారట. "కట్నం తప్పనిసరిగా కావాలి " అని మార్చాడు. అయినా లాభం లేక పొయ్యింది. ఇలా కాదని.. "కట్నం తీసుకు రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను..ఖబడ్దార్!" అని మార్చాడు. కొత్త సంబంధాలు ఏమీ రాలేదు కానీ పోలీసుల నుంచి ఫోను మాత్రం వచ్చింది...అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాట తయారు చేసుకోవాలి. "సిగరెట్టు, మందు అలవాటు లేదు " లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు...అసలుకే మోసం వస్తుంది.

మధ్యవర్తులు: వీళ్ళు చేసే అన్యాయం అంతా ఇంతా కాదు - మనకు నెలనెలా వచ్చే జీతం నుంచి..మన అండర్వేరు సైజు వరకు ఎవ్వరికీ చెప్పని వ్యక్తిగత విషయాలన్నీ దబాయించి అడిగి తెలుసుకుంటారు..వాళ్ళు తెచ్చిన ప్రతీ సంబంధానికి "అమ్మాయి భూమిక లాగ ఉంటుంది..కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు " అంటారు. తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అమ్రీష్ పురి లాగ ఉంటుంది.

ఇంట్లో వాళ్ళ కంగారు: ఒక్క సారి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంట్లో వాళ్ళు పడేదానికన్నా మనల్ని పెట్టే కంగారు ఎక్కువ.ఇంటికి వచ్చిన ప్రతీ వాడితో "మా వాడికి ఏవైన సంబంధాలు ఉంటే చూడరదూ " అంటారు. ఆ వచ్చినోడు మనల్ని ఎగా దిగా చూసి "నువ్వు కాస్త నీటుగా ఉండే బట్టలేసుకోవాలి మరి....అలా జుట్టు పెంచుకుంటే కుదరదు" అని ఐదు పైసల సలహాలు రెండు ఇచ్చి పోతాడు. ఛీ.. ఇలా మాటలు పడటం కన్నా ఆ ఆడ అమ్రీష్ పురి ని చేసుకోవటం మేలనిపిస్తుంది.

జాతకాలు: పిల్లవాడు పుట్టాక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం మరచిపొయ్యినా జాతకం రాయించటం మాత్రం పొరపాటున కూడా మరువరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు కుదరటం వెనకాల ఉన్న కష్టాలు తెలుసుకున్న జ్యోతిష్యులు జాతకాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.

నా ఫ్రెండు దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు:

చదువు -అద్భుతం
ధనం - అద్భుతం
కళ్యాణ యోగం - అద్భుతం (conditions apply)
మనతో పాటూ చదువుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది...."వాడిని అడిగైన తెలుసుకో ఏమి తప్పు చేస్తున్నావో " అంటారు. మనమేమీ మాట్లాడలేము. మనతో పాటూ ఫెయిల్ అవుతున్న ఫ్రెండు సడన్ గా 35 మార్కులతో పాస్ అయ్యి "పరీక్షలలో పాస్ కావటం ఎలా " అని సలహా ఇచ్చినట్టు... వాడూ ఏవో రెండు మాటలు చెప్తాడు.
ఇంట్లో వాళ్ళ ఎమొషనల్ బ్లాక్మెయిల్ వల్ల పెళ్ళికి సిధ్ధ పడ్డ అబ్బాయిలు చాలా మంది తెలుసు నాకు. అమ్మాయిలకు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు...అలా అని మరీ కొట్టిపారేసేంత చిన్నదీ కాదు..అందుకేనెమో ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎక్కువ మంది గుర్తించరు...

ఓణం - ఆణో - పెణ్ కుట్టి

ఓ నెల రోజుల క్రితం మాట...మా వదిన షాపింగు చెయ్యాలంటే తోడు వెళ్ళాను. తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని కొత్త చెప్పులు కొనటానికి 'మెట్రో షూ మార్టు ' కు వెళ్ళాము. మూడు గంటల తరువాత తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా ఎవరో ఒకమ్మాయి వచ్చి మా వదినను పలకరించింది..ఓ ఐదు నిముషాల పాటు మాట్లాడుకున్నారు..దూరంగా కూర్చున్న నన్ను చూపించింది మా వదిన..ఈ చెప్పుల కొట్టోడికి నన్ను తాకట్టు పెట్టేస్తొందేమోనని కంగారు కంగారు గా పరిగెట్టుకెళ్ళాను..."

ఈ సారికి మా వాడు వస్తాడు...ఇదిగో..మాటల్లోనే వచ్చాడు....ఈ అమ్మాయి నా ఫ్రెండు శిల్ప చెల్లెలు - పూర్ణిమ...వీడు నా మరిది - గౌతం" అని పరిచయం చేసింది..."మీరు తప్పకుండా రావాలి...అడ్రసు మీ వదినకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి..మా వదిన నా వైపు తిరిగి "ఈ 12 వ తారీఖు వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ ఉంది...నేను, మీ అన్నయ్య ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి నిన్ను పంపిస్తానని మాటిచ్చాను" అంది.." నేనెళ్ళను..ఆ రోజు నాకు ఆఫీసు లో మూడు మీటింగ్లున్నాయి, మొబైలు బిల్లు కట్టాలి, బ్యాంకు లో పనుంది, ఫ్రెండ్స్ తో సినిమా ప్లానుంది, డిన్నర్....""అది 'ఓణం' ఫంక్షన్...పెళ్ళి కాని మళయాళీ అమ్మాయిలు బోలెడు మంది వస్తారు""ఆ కవర్లు ఇటీ వదినా...ఎన్నింటికెళ్ళాలి?" *******************************************
నాకు మళయాళంలో అత్యంత ఇష్టమైన పదాలు మూడున్నాయి - ఓణం, ఆణో, పెణ్ కుట్టి...'పెణ్ కుట్టి ' అంటే 'అమ్మాయి ' అని అర్థం..ఆ భాష లో ఇంతకన్నా అందమైన పదం ఉండటం అసాధ్యమని నా లిస్టు అక్కడితో ఆపేసాను..మళయాళీలను 'మల్లు'లు అంటారని అందరికీ తెలుసు..కానీ మళయాళీ అమ్మాయిలను 'మల్లమ్మ'లు అంటారని కొందరికి మాత్రమే తెలుసు..(మల్లమ్మ = మల్లు + అమ్మాయి - షష్టీ తత్ 'పురుష' సంధి).. పూర్ణిమ వాళ్ళ ఇల్లు ఇందిరా నగర్ లో - విజయనగర్ నుండి 15 కిలోమీటర్లు. త్వరగా బయలుదేరాలని ఉదయాన్నే, తెల్లవారుజామునే, మరియు పొద్దున్నే లేచాను..వెళ్తున్నది 'ఓణం' ఫంక్షన్ కు కాబట్టి..మళయాళీల సంప్రదాయ లుంగి, చొక్కా వేసుకుని, Asianet చానెల్ లో యేసుదాస్ సుప్రభాతం విని, అయ్యప్ప స్వామికి మొక్కుకుని, కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను..నీల్ విజయ్ గాడి ఫోను వచ్చింది - "జై ఓణం...చెప్పరా""ఏరా..ఓణం ఫంక్షన్ కు వెళ్తున్నావంట...మీ అన్నయ్య చెప్పాడు. నేనొక్కడే వెళ్తానంటే నా వైఫ్ ఒప్పుకోదు..మా ఇంటికి రారా..ఇద్దరూ కలిసి వెళ్దాం..అసలే మల్లమ్మలు.. ""నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరా...చూసావా..పెళ్ళి చేసుకోకపోవటం వల్ల ఉన్న లాభాలు....ఉహుహుహహహ" అని వికటాట్టహాసించాను (వికటాట్టహాసం = వికట + అట్టహాసం - 'హాసం'-పత్రిక-నిలిచిపోయింది సంధి)... మరో అరగంటలో పూర్ణిమ వాళ్ళ ఇల్లు చేరాను..వాళ్ళ ఇంటి వెనకాల నా పడవ పార్కు చేస్తుండగా నా పక్కన ఒక TVS-50 వచ్చి ఆగింది.."హమ్మయ్య..సరిగ్గా టైముకు వచ్చాను " అన్న మాటలు వినిపించాయి...ఇక్కడ తెలుగు మాట్లాదేది ఎవర్రా అని పక్కకు చూసాను....దినకర్ గాడు...."రేయ్...నువ్వేమి చెస్తున్నావిక్కడ???" అనడిగాను"నువ్విక్కడ జరిగే ఓణం సంబరాలకు వస్తున్నావని ఇందాకే నాకొక ఆకాశరామన్న sms వచ్చింది...... అయినా ఇది చాలా అన్యాయం రా..సంవత్సరానికి 9 సార్లు నాతో బర్త్ డే పార్టీలు తీసుకోవటానికి మాత్రం ఫోన్లు చేస్తుంటావే..... ఇంతమంది మల్లమ్మలను కలిసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చెయ్యవేరా??" అన్నాడు తన TVS-50 ని చెట్టుకి కట్టేస్తూ.... ఇంతలో నాకొక sms వచ్చింది..నీల్ విజయ్ గాడి దగ్గరి నుండి.."ఉహుహుహహహ - ఇట్లు ఆకాశరామన్న" అని ఉంది..దినకర్ గాడికి ఆ SMS చూపించాను.. "వార్నీ...నీకు కూడా నీల్ విజయ్ గాడి మొబైల్ నుండే వచ్చిందా??... ఈ ఆకాశరామన్న గాడెవడో నీల్ గాడి మొబైల్ నుండి అందరికీ మెసేజ్ లు చేస్తున్నాడు రా....వెంటనే నీల్ గాడికి ఫోను చేసి చెప్పాలి..." అని నా డ్రస్సు వైపు వింతగా చూసాడు.."మల్లూల సంప్రదాయ దుస్తులు రా...ఓణం కదా అని" అన్నాను.. "ఇలా లుంగీలు, గోచీలు కట్టుకొస్తే అమ్మాయిలు నీ దగ్గరకు కూడా రారు... నాతో ముందే చెప్పుంటే నాలాగ 'hep' గా డ్రెస్ చేయించుండేవాడిని కదరా " అంటూ తన డ్రస్సు చూపించాడు......గులాబి రంగు జీన్సు ప్యాంటు ....టీషర్టు మీద 'Cool Dude' అని రాసుంది........తలకు నవరత్న తైలం రాసుకుని, నుదుటికి వీబూది అడ్డబొట్టు పెట్టుకున్నాడు......చిన్నగా నవ్వి ప్యాంటు కాస్త పైకి లేపాడు...కుడికాలికి ఎరుపు, ఎడమ కాలికి నీలం రంగు సాక్సులు వేసుకునున్నాడు...."ఆ సాక్సులేంట్రా" అన్నాను.. "చూసావా..అమ్మాయిలు కూడా నా సాక్సులు చూడగానే ఇలానే అడుగుతారు..నేను వెంటనే వాళ్ళ పేరు, ఫోన్ నంబరు తీసుకుంటాను...గేం ఓవర్!" అని గట్టీగా అరిచి, ప్యాంటూ అలా పైకెత్తుకుని "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అంటూ నా చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు... .
---------------------------Flashback - 1---------------------------
అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు..మా క్లాసు ఎదురుగా ఒకటో తరగతి పిల్లలు "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అని ఆడుకుంటున్నారు. నేను చూస్తుంది ఆ పిల్లలను కాదు..వాళ్ళను ఆడిస్తున్న మా సరస్వతి మిస్సును...సరస్వతి మిస్...మళయాళం అమ్మాయి.......నా ఫస్ట్ లవ్!సరస్వతి మిస్సు మాకు సోషల్ స్టడీస్ చెప్పేది..తన అందం తో నా చదువు సర్వనాశనం చెసింది..అందమే అనుకుంటే.. అందానికి మించిన తెలివితేటలు. ఎవ్వరూ, ఎప్పుడూ వినని విషయాలెన్నో మాకు చెప్పేది మా మిస్సు. "శ్రీలంక రాజధాని ఆఫ్ఘనిస్తాన్" అన్న మా సరస్వతి మిస్ మాటలు ఆ తరువాత ఎక్కడైన ఎవరైన రాసారేమో/చెప్పారేమో అని ఎంత వెతికినా లాభం లేకపొయ్యింది...మా మిస్సు కు నేనంటే మొదటి నుండి అదోకరకమైన ఇది..నన్ను అప్పుడప్పుడూ 'కుట్టా' అని పిలిచేది - 'కుట్టా' అంటే మళయాళం లో 'స్వీట్ బాయ్' అని అర్థం!చాలా సార్లు 'useless idiot' అని కూడా పిలిచేది - 'useless idiot' అంటే ఇంగ్లీషులో 'స్వీట్ బాయ్' అని అర్థం!మా సరస్వతి మిస్ అపురూప సౌందర్యాన్ని చూసే అప్పట్లో ఇంగ్లీషు పెద్దలు ఒక సామెత కనుగొన్నారు - "Man is a social animal" అని......అంటే - "మా సోషల్ మిస్సుని ప్రేమించని మనిషి జంతువుతో సమానం" అని అర్థం...అటువంటి మా సరస్వతి మిస్సు..సరస్వతి మిస్సెస్ గా మారబోతోందని తెలిసింది. మా స్కూల్లో అందరికీ కార్డులు పంచింది. నా బుగ్గ నిమిరి "పెళ్ళికి తప్పకుండా రావాలి కుట్టా" అని తట్టా బుట్టా సర్దుకుని నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది....ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా దగ్గు మందు తాగి దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను..ఆ మరుసటి రోజే నిర్ణయించుకున్నాను - ఇంకోసారి ప్రేమలో పడకూడదని!
-------------------------------
దినకర్ గాడు పడ్డాడు - నా చుట్టూ తిరుగుతున్న హుషారు లో ఒక గులక రాయి మీద జారి..వాడీని పైకి లేపి "పద లోపలకు వెళ్దాం..లోపల నీ విపరీత చేష్టలు కాస్త అదుపులో పెట్టుకో" అని హెచ్చరించి లోపలకు తీసుకెళ్ళాను....మేము ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ 30, 40 మంది మల్లమ్మలు కిల కిల, గల గల అని మళయాళం లో నవ్వుతూ కనిపించారు...అంత మంది అందమైన అమ్మాయిలను చూడగానే దినకర్ గాడికి (లేని) మతి పోయింది.."ఆహా..నా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఇన్నాళ్ళకు దొరికింది రా..నా చార్మ్ తో ఇక్కడుండే అమ్మాయిలందరిని మెస్మరైజ్ చేసి అవతల పారేస్తాను....చూస్తూ ఉండు...ఇంకో రెండు మూడూ గంటల్లో ఈ మల్లమ్మలందరూ 'దినకర్ నాకు కావాలి...దినకర్ నా వాడూ అని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటారు" అని...రెండు క్షణాలాగి "సరే పద...ఇద్దరం కలిసి విజృంభిద్దాం" అని నా చెయ్యి పట్టుకు లాగాడు...."ఇద్దరం కలిసా??...వద్దురా...'గౌతం జోగి, దినకర్ జోగి రాసుకుంటే కిలో బూడిద రాలిందంట'....ఎందుకు రిస్కు..ఎవరికి వాళ్ళు ప్రయత్నిద్దాం..ఏమంటావు?" అన్నాను...వాడు ఏమీ అనకముందే పూర్ణిమ నన్ను గుర్తు పట్టి నా దగ్గరకు వచ్చింది.."హై గౌతం..రండి..ఎవరో ఫ్రెండును కూడా తీసుకొచ్చినట్టున్నారు...గుడ్..సరిగ్గా టైం కు వచ్చారు..ఇప్పుడే ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి..వెళ్ళీ మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి - అక్కడ" అని ఒక చిన్న టేబులుముందు నుంచున్న ముగ్గురు అమ్మాయిల వైపు చూపించింది...నేను థ్యాంక్స్ చెప్పేలోపు దినకర్ గాడు నన్ను లాక్కుని ఆ అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్ళాడు.."హెలో..వెల్కం. మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి..ఇంకో పది నిముషాల్లో పోటీ మొదలవ్వబోతోంది" అంది ఆ ముగ్గురిలోకి కాస్త పొడుగ్గా ఉన్న మల్లమ్మ..దినకర్ గాడు వెంటనే తిరుపతి లోని ప్రతాప్ థియేటర్ ఎదురుగుండా కొన్న 67 రూపాయల సన్ గ్లాసెస్ తన జేబులోంచి తీసి పెట్టుకుని - "నా పేరు దినకర్" అన్నాడు.."స్పెలింగ్ చెబుతారా?" అడిగిందా అమ్మాయి.."Dinakarqwxyz" అన్నాడు మావాడు.."అదేంటండి??"దినకర్ గాడు టేబుల్ మీదకెక్కి కూర్చుని, తన సన్ గ్లాసెస్ ముక్కు మీదకు జార్చి - "నా పేరులో చివరి ఐదక్షరాలు సైలెంట్.....ఒక వేళ మీకు కష్టమనిపిస్తే 'The nakar' అని రాసుకోండి" అన్నాడు..ఆ అమ్మాయి ఏదో రాసుకుని - "మీ మెయిల్ ID ఇస్తారా..వచ్చే నెలలో మా మళయాళీ సంఘం వాళ్ళు ఒక నాటకం వెయ్యబోతున్నారు..మీకు ఇన్విటేషన్ పంపుతాము" అంది.."తప్పకుండా...నా మెయిల్ ID - dinakarmarella@gmail.com.....password - lakshmikrishna.....నా ఫోన్ నంబరు - 9845749659""ఫోన్ నంబరు అవసరం లేదండి""పర్లేదు ఉంచండి....నంబరు మీ దగ్గరుంటే ఒకటి..నా దగ్గరుంటే ఒకటీనా.." అని తన మొబైల్ బయటకు తీసి "ఇంతకీ మీ నంబరు చెప్పలేదు" అన్నాడు..."అవును" అని సమధానమిచ్చింది ఆ అమ్మాయి..జరిగేదంతా నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను...ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా.....మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు...ఆ అమ్మాయి తన దగ్గరున్న లిస్టులో ఏవో టిక్కు మార్కులు పెట్టి మా ఇద్దరినీ ఇంకో నలుగురు అమ్మాయిలున్న టీములో వేసింది..."అదిగో మీ టీము వాళ్ళు అక్కడున్నారు" అని రూము చివర్న పూల బుట్ట పక్కనున్న అమ్మాయిల వైపు చూపించింది..దినకర్ గాడు ఆ రెజిస్ట్రేషన్ అమ్మాయితో ఏదో మాట్లాడుతుండంగానే నేను మా టీమ్మేట్స్ వైపు వెళ్ళాను...ఆ నలుగురిలో ఒకమ్మాయికి బుగ్గ మీద సొట్టుంది...."నన్ను మీ టీం లో వేసారండి" అన్నాను ఆ అమ్మాయిని చూసి..."అలాగా...నా పేరు స్మిత...మీరు?" అని చెయ్యి ముందుకు చాచింది.."గౌతం" అని షేక్ హ్యాండు ఇచ్చాను...షేక్ హ్యాండు ఇస్తుంటే...నా జీవితాన్ని షేక్ చేసి నాకు హ్యాండిచ్చిన 'సునయన ' గుర్తొచ్చింది..
------------------------------- Flashback - 2-------------------------------
సునయన - నా రెండో ఫస్ట్ లవ్...ట్రివేండ్రం అమ్మాయి...ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్...నేనెప్పుడు కనిపించినా నవ్వుతూ షేక్ హ్యాండిచ్చేది..తను నా చెయ్యి తాకినప్పుడల్లా నా జీవితం బృందావన్ గార్డెన్స్ లాగా అందంగా కనిపించేది....సునయన ను కలిసిన మొదటి నెలలోనే నిర్ణయించుకున్నాను....'జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సునయన నే చేసుకోవాలి'* అని....(*కుదరక పొతే వేరే అమ్మయిని చేసుకుందాం)మా మూడవ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవానికి మేము గ్రూప్ డాన్సు చెయ్యాలని అనుకున్నాము..ఏ పాటకు చెయ్యాలనే విషయం మీద మొదలయ్యింది గొడవ..."మనము చెసేది శాస్త్రీయ నృత్యం కాబట్టి 'నిన్నా కుట్టేసినాది, మొన్న కుట్టేసినాది గండు చీమా ' అనే తెలుగు పాటకు చేద్దాము " అని నేను...."కాదు 'ఓణం, ఆణో, పెణ్ కుట్టి' అనే మళయాళం పాటకు చేద్దామని సునయన.....చివరకు మా గ్రూపు లోని మిగతావాళ్ళంతా మళయాళం పాటకే ఓటేసారు. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను. సునయన తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను...తను ఎప్పుడో గిఫ్టుగా నాకిచ్చిన నట్రాజ్ పెన్సిల్, ఇమామి కోల్డ్ క్రీం తనకు తిరిగిచ్చేసి - వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసాను..(ఇందాక flashback మొదలవ్వకముందు సునయన నాకు హ్యాండిచ్చిందని అన్నాను కద....సారీ....నేనే హ్యాండిచ్చాను)-







--------------------------------------
"ఎలా ఉంది ముగ్గు" అంది స్మిత...ఉలిక్కిపడి, ఉలిక్కిలేచి...ముగ్గు చూసాను..
"నన్ను పెళ్ళి చేసుకుంటావా స్మిత" అనటానికి మళయాళం లో ఏమంటారో అని ఆలోచిస్తుండగా దినకర్ గాడు నా దగ్గరకు వచ్చి "రేయ్..నేనిప్పుడే వస్తాను..అలా వాకిట్లోకెళ్ళీ కుందేలునో, జింకనో పట్టి తీసుకురావాలి" అన్నాడు..."ఏమి మాట్లాడుతున్నావు రా...ఒక్క ముక్కా అర్థమవ్వట్లేదు" అన్నాను.."అదిగో అక్కడ మంచి నీళ్ళు తాగుతోందే అమ్మాయి..ఆ అమ్మయిని పేరు అడిగాను రా..'పట్టీ పో' అంది...సీత రాముడిని అడిగినట్టు జింకనో, కుందేలునో పట్టి తీసుకు రమ్మందేమొనని వెళ్తున్నా" అన్నాడు..."రేయ్ మూర్ఖుడా...'పట్టి' అంటే మళయాళం లో 'కుక్క' అని అర్థం రా" "అవునా??""అవును...'పట్టి పో' అంటే......'నీ కుక్క బుధ్ధులు ఇంకెక్కడైన చూపించుకో పో...ఆ 67 రూపాయల చల్లద్దాలు తీసెయ్యి..గౌతం దగ్గర తీసుకున్న cd లు, లీటర్ పెట్రోలు ఎప్పుడూ తిరిగిస్తావు బే....TVS-50 చెట్టుకు కట్టెయ్యటమేంట్రా గులాబి రంగు జీన్సు ప్యాంటు వెధవా" అని అర్థం" అన్నాను...."పేరు అడిగినందుకు పేరగ్రాఫ్ పొడుగు తిట్టు తిట్టిందా పట్టి మొహం ది"....అని కాస్సేపు బాధపడి...."ఏంటోరా..ఈ రోజు అంతా రివర్సే...నువ్వు ఆ ముగ్గు గొడవలో ఉండగా 14 మంది అమ్మాయిలను ట్రై చేసాను...ఒక్కరూ వర్క్ అవుట్ అవ్వలేదు.........సరే..నీ పరిస్థితి ఏంటి" అనడిగాడు..."నాతోరా...Mrs.గౌతం ను పరిచయం చేస్తాను" అని స్మిత దగ్గరకు తీసుకెళ్ళాను..స్మిత కూడా తన ఫ్రెండు ఎవరినో నాకు పరిచయం చెయ్యటానికి తీసుకొచ్చింది.."దిసీజ్ గౌతం...ముగ్గుల పోటీలో మా టీం లో ఉన్నాడు..మళయాళం బాగా మాట్లాడతాడు తెలుసా" అంది.."అవునా...ఎలా నేర్చుకున్నారు మళయాళం?" అడిగింది ఆ అమ్మాయి.."నేను TV లో ఎప్పుడూ మళయాళం చానెల్స్ చూస్తూ ఉంటానండి..అలా పట్టేసాను..నా డ్రస్సు చూసారా....మొన్న శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో చూసిన మళయాళం సినిమాలోని కాస్ట్యూంసే ఈ నా ఈ డ్రస్సుకు ఇన్స్పిరేషన్" అన్నాను...దినకర్ గాడు నా భుజం మీద గిల్లి - "శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో మనము చూసిన సినిమాలో అసలు హీరో, హీరోయిన్లు కాస్ట్యూంసే వేసుకోలేదు కద రా" అన్నాడు...స్మిత, స్మిత స్నేహితురాలు నా వైపు అస్సహ్యంగా చూసి - "ఓణం, ఆణో, పెణ్ కుట్టి" అని ఛీదరించుకును వెళ్ళిపోయారు.. కళ్ళలో నీళ్ళతో దినకర్ గాడి వైపు చూసాను.."సారీ రా...తప్పు చేసాను...క్షమించు" అన్నాడు..."తప్పు నీది కాదులేరా...ఎందుకో చెబుతా విను....నీ Orkut ప్రోఫయిల్ లో, పర్సనల్ డీటెయిల్స్ లో 'Ideal Match' పక్కన 'India vs Pakistan in sharjah' అని రాసుకున్న ఏబ్రాసి వెధవవి నువ్వు..ఇది తెలిసి కూడా నాకిష్టమైన అమ్మాయిని పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళానే....నాది రా తప్పు....నా పేరు మార్చుకోవాలి రా 'దినకర్ ' అని....." అని ఏడ్చేసాను..ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళే సరికి నీల్ విజయ్ గాడు అందరికీ పార్టీ ఇచ్చాడు...నా మూడో ఫస్ట్ లవ్ ఫెయిలైనందుకు...ఆ తరువాత మా వాళ్ళు కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు.....ఇదిగో..మొదటి బహుమతి పొందిన ముగ్గు -