Sunday, February 15, 2009

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. అయితే వాటికున్న పరస్పర వ్యతిరేక లక్షణాలే
పెళ్లికి అడ్డంగా నిలిచాయి. నిప్పు తాకితే నీరు ఆవిరై పోతుంది. నీరు నిప్పుపై పడితే చల్లారి పోతుంది. మరి పెళ్లి చేసుకోవడం ఎట్లా..? అని అవి దీర్ఘంగా ఆలోచించాయి.ఎంతకీ దారీ, తెన్నూ తెలియక పోవడంతో.. తమ తమ చుట్టాలను సంప్రదించాయి నీరూ, నిప్పూ. నీరేమో తన బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పక పోవడమే గాకుండా, "మనకు వాటికి జన్మ జన్మల వైరం ఎట్లా కుదురుతుందంటూ" కోప్పడ్డాయి.నిప్పేమో తన బంధువులైన పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పుమీద ఇంతెత్తున లేచాయి. నీరూ, నిప్పు ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు. పైగా, అదెలా సాధ్యం అని వీటినే ప్రశ్నించాయి, కోప్పడ్డాయి, కుదరదన్నాయి.అందరిలాగే పెళ్లి చేసుకుని, పిల్లా జెల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్న నీరూ, నిప్పూ ఆశ తీరే దారే కనిపించలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన అధీనంలోకి తీసుకున్న కార్మికుడి వద్దకెళ్లి... ఎలాగైనా సాయం చేయమని అడిగాయి.అతను ఆలోచించి.. సరేలే.. మీ ఇద్దరికీ పెళ్లి నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించి, ఇరువైపులా చుట్టాలను పిలిచాడు. పెళ్లి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదకరమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా రాద్ధాంతం చేశాయి.అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్న కార్మికుడు పెద్దలను ఒప్పించాడు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాడు. నీరూ, నిప్పును బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు. ఎవ్వరూ కాదన్నా కూడా తమకు సాయంగా నిలిచి పెళ్లి చేసిన కార్మికుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాయి నీరూ, నిప్పూ...ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోసాగారు. వీరికి ఆవిరి అనే కొడుకు పుట్టాడు. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు.. పిడుగు, అగ్ని పర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాణ్ణి చూసి అందరూ సంతోషపడ్డారు. వీడేమో చక్కగా రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.నీరూ, నిప్పూలకు పెళ్లి చేయటమే ప్రమాదమని వారించిన బంధుమిత్రులు.. ఇతర ప్రజానీకం అందరూ ఇప్పుడేమో ఆవిరిగాణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద సాహసం చేసి రెండింటినీ కలిపిన కార్మికుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

No comments:

Post a Comment