Sunday, February 15, 2009
అందం సరే... మరి వ్యక్తిత్వం మాటో...!!
ఈనాటి స్పీడ్ యుగంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందంగా ఉండటం అంటే.. తెల్లగా ఉండటమే అన్న భావం ఇప్పటి యువతలో బలంగా నాటుకుపోయింది. అందంగా, తెల్లగా కనిపించేందుకోసం వీరు పడే పాట్లు అంతా ఇంతా కాదు. "మీరు మా క్రీమును వాడితే రెండు రోజుల్లోనే తెల్లగా మారిపోతారంటూ" వచ్చే ప్రకటనలపై వీరు చాలా సులభంగా ఆకర్షితులవుతుంటారు.ఇలా ఏదిబడితే దాన్ని తీసుకుని, తమ శరీరాలపై ప్రయోగం చేసేసే వీరు.. తెల్లబడటం కథ అలా పక్కనుంచేస్తే... చాలా రకాల సైడ్ ఎఫెక్ట్‌ల బారిన పడుతుంటారు. "ఉన్నది పోయే..." అన్న చందంగా మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములను కొనేందుకు, తమ పాకెట్ మనీనంతా నీళ్లలాగా ఖర్చుచేసి మరీ డంగైపోయే ఈనాటి అమ్మాయిల కోసం... ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, వారి అందాన్ని పెంచుకునేందుకు... కాసిన్ని చిట్కాలు... అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. అయితే... ఆరోగ్యమైన చర్మానికి మార్కెట్‌లో దొరికే పలురకాల క్రీములకంటే, ఎక్కువగా మేలు చేసే గుణాలు మనం ప్రతిరోజూ వాడుతుండే పాలు, పండ్లు, వంటింటి పోపుల దినుసుల్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.
రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జులో పది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగి చూడండి. జిడ్డు మాయమై ముఖం ప్రెష్‌గా, ప్రకాశవంతంగా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.అలాగే... రెండు లేదా మూడు పెద్ద క్యారెట్లను ఉడికించి మెత్తగా చిదిమి, దానికి నాలుగు టీస్పూన్ల తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ఓ వెలుగు వెలిగిపోతారు సుమా...! ఇకపోతే ఈ మాస్క్... అన్ని రకాల చర్మ తత్వాలకూ పని చేస్తుంది.పచ్చిపాలలో దూదిని ముంచి చర్మాన్ని తుడిస్తే... కంటికి కనిపించనటువంటి మురికి వదిలిపోతుంది. పాలు చర్మ రంధ్రాలలోకి వెళ్లి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. స్వచ్ఛమైన ఆముదంతో చర్మాన్ని మర్దనా చేస్తే... మృదుత్వాన్ని సంతరించుకోవడమే గాకుండా, ముడుతలను నివారిస్తుంది. ముడుతలు మాయమైతే అట్టే వయసయిపోయినట్లు కనిపించరు కదా..!ఒక టీస్పూన్ కమలాపండు రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత తుడిచివేయాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేగాకుండా, చర్మానికి చక్కటి మెరుపునిచ్చి, కాంతివంతంగా చేస్తుంది.ఒక టీస్పూన్ మినప్పప్పు, ఐదారు బాదంపప్పులు కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బి ముఖానికి పట్టించి, అరగంట తరువాత కడిగేయాలి. ఈ ప్రొటీన్ మాస్క్ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో రెండు టీస్పూన్ల పాలమీగడ కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగితే అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీనిని ఏ రకం చర్మం కలవారైనా వాడవచ్చు.కాబట్టి... మోసపూరిత ప్రకటనల బారిన పడకుండా... ప్రకృతి సహజంగా, స్వచ్ఛంగా దొరికే పాలు పండ్లు, పోపుల సామానులతోనే మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. సైడ్ ఎఫెక్ట్‌ల బాధనుండి తప్పించుకోండి. అయితే.. చివర్లో నాదో మనవి... అందంగా కనిపించాలని మాత్రమే తాపత్రయపడకుండా, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు కూడా కృషి చేయగరని కోరుకుంటూ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment